యాడ్స్ మేనేజర్లో సాధారణ సమస్యలను పరిష్కరించడానికి ఈ మార్గదర్శినిని ఉపయోగించండి. మీ సమస్యకు అత్యంత దగ్గరగా ఉన్న సమస్య వర్గంతో ప్రారంభించండి. సిఫార్సు చేసిన తనిఖీలను పూర్తి చేసి, సమస్య కొనసాగితే సహాయ బృందాన్ని సంప్రదించండి. ఖాతా ధృవీకరణ, ఖాతా ఆమోదం, ప్రకటన సమీక్ష, ప్రకటన ప్రదర్శన వేర్వేరు తనిఖీలు. ఒకటి పూర్తయినంత మాత్రాన మిగిలినవన్నీ పూర్తయినట్లు కాదు.
1. వ్యాపార ధృవీకరణ
నా వ్యాపార ధృవీకరణ విఫలమైంది
దీని అర్థం: మీ ఖాతా ధృవీకరణను పూర్తి చేశాము, కానీ దానికి ఆమోదం ఇవ్వలేకపోయాము. మీ వ్యాపార గుర్తింపు, యాజమాన్యం లేదా అనుబంధాల వివరాలు సరైనవని నిర్ధారించలేనప్పుడు ధృవీకరణ విఫలం కావచ్చు.
తదుపరి చర్య: మీ ఖాతా, ప్రకటనలు, గమ్య పేజీలు మీ వ్యాపారాన్ని, ఇతర వ్యక్తులు, సంస్థలు లేదా బ్రాండ్లతో ఉన్న సంబంధాలను సరిగ్గా ప్రతిబింబించేలా చూసుకోండి.
నా వ్యాపార ధృవీకరణ జరుగుతోంది
దీని అర్థం: మీ ఖాతా ధృవీకరణ జరుగుతోంది. ప్రస్తుతం మీరు ఎలాంటి చర్యా తీసుకోవాల్సిన అవసరం లేదు.
తదుపరి చర్య: సమీక్ష పూర్తి కావడానికి 7 పని దినాల వరకు పట్టవచ్చు. అంతకంటే ఎక్కువ సమయం పడితే ప్రకటనల సహాయ బృందాన్ని సంప్రదించండి.
నా వ్యాపార ధృవీకరణ ప్రారంభం కాలేదు
ముందుగా తనిఖీ చేయండి: సరైన యాడ్స్ మేనేజర్ ఖాతాలో ధృవీకరణ సూచనకు తిరిగి వెళ్లండి. పేజీని మళ్లీ లోడ్ చేయండి లేదా తాజా బ్రౌజర్‌ను ఉపయోగించి మళ్లీ సైన్ ఇన్ చేయండి.
తదుపరి చర్య: అప్పటికీ ముందుకు వెళ్లలేకపోతే, ఏ దశలో విఫలమైందో తెలియజేస్తూ ప్రకటనల సహాయ బృందాన్ని సంప్రదించండి.
2. పరిశ్రమ అర్హత
నా వ్యాపారానికి లేదా పరిశ్రమకు ప్రకటనలు ఇవ్వడానికి అర్హత లేదు
దీని అర్థం: ప్రస్తుత ప్రకటనల విధానాలు మీ పరిశ్రమ లేదా సేవలకు సంబంధించిన ప్రకటనలను OpenAIలో అనుమతించవు. అనుమతించిన పరిశ్రమలు, సేవల వర్గాల కోసం దిగువ అర్హత పట్టికను చూడండి. వ్యాపారం నమోదై ఉన్నంత మాత్రాన లేదా లైసెన్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ప్రకటన వర్గంలో లేదా మార్కెట్లో దానికి అర్హత ఉన్నట్లు కాదు.
తదుపరి చర్య: తిరస్కరణకు కారణం, తదుపరి చర్యల వివరాలతో మీకు ఇమెయిల్ వచ్చి ఉండవచ్చు. నిర్ణయం తప్పని మీరు భావిస్తే, ఆ ఇమెయిల్‌లోని లింక్‌ను ఉపయోగించి లేదా యాడ్స్ మేనేజర్ ద్వారా అప్పీల్ చేయండి. పరిష్కారం పొందడానికి అప్పీల్ చేయడం అత్యంత వేగవంతమైన మార్గం. అప్పీల్ చేయడంలో ఏవైనా సమస్యలు ఎదురైనా లేదా అప్పీల్ ఎంపిక కనిపించకపోయినా సహాయ బృందాన్ని సంప్రదించండి.
3. ప్రకటనల తిరస్కరణలు (విధానాల ప్రకారం అర్హత పట్టిక)
నా ప్రకటన తిరస్కరించబడింది
ముందుగా తనిఖీ చేయండి: యాడ్స్ మేనేజర్‌లోని తిరస్కరణ సందేశాన్ని చదివి, సమస్య ఉన్న పాఠ్యం, చిత్రం లేదా గమ్య పేజీని గుర్తించండి. ప్రకటనలోని అన్ని అంశాలు, దాని గమ్యస్థానం ప్రకటనల విధానాలకు అనుగుణంగా ఉన్నాయో, ఒకే ఉత్పత్తి లేదా సేవను వివరిస్తున్నాయో తనిఖీ చేయండి.
తదుపరి చర్య: విధానాల ఆధారంగా పేర్కొన్న కారణం మీ ప్రకటనకు వర్తించదని మీరు భావిస్తే, యాడ్స్ మేనేజర్‌లోని అప్పీల్ ఎంపికను లేదా సమీక్షను అభ్యర్థించండి బటన్‌ను ఉపయోగించవచ్చు. పరిష్కారం పొందడానికి అప్పీల్ చేయడం అత్యంత వేగవంతమైన మార్గం. కాబట్టి అప్పీల్ ఎంపిక అందుబాటులో లేకపోతే లేదా అప్పీల్‌పై 7 రోజులకు మించి నిర్ణయం రాకపోతే మాత్రమే ప్రకటనల సహాయ బృందాన్ని సంప్రదించండి.
నేను ఎంచుకున్న దేశాల్లో నా ప్రకటనలు ప్రదర్శించబడటం లేదు
దీని అర్థం: ప్రచారం లక్ష్యంగా చేసుకున్న దేశాలను అనుమతించిన విధాన వర్గాలతో పోల్చి చూడండి. నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లో విధాన వర్గాలకు అనుమతి లేనప్పుడు ఈ లోప సందేశం కనిపిస్తుంది. కొన్ని వర్గాలు అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం. ప్రస్తుతం మేము కొద్దిమంది ప్రకటనదారులతో మాత్రమే పని చేస్తున్నాము. కొన్ని విధాన వర్గాల్లో అనుమతి కోసం దరఖాస్తులను స్వీకరించడం లేదు. దిగువ ప్రకటనల విధానాల ప్రకారం అర్హత పట్టికను చూడండి.
తదుపరి చర్య: విధానాల ఆధారంగా ప్రకటనపై విధించిన పరిమితి తప్పని మీరు భావిస్తే, యాడ్స్ మేనేజర్లో లేదా తిరస్కరణ నోటీసులో అప్పీల్ ఎంపిక అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించండి. పరిష్కారం పొందడానికి అప్పీల్ చేయడం అత్యంత వేగవంతమైన మార్గం. కాబట్టి అప్పీల్ ఎంపిక అందుబాటులో లేకపోతే లేదా అప్పీల్‌పై 7 రోజులకు మించి నిర్ణయం రాకపోతే మాత్రమే ప్రకటనల సహాయ బృందాన్ని సంప్రదించండి.
4. డొమైన్ ఆమోదాలు
ఈ ఖాతా కోసం నా డొమైన్‌కు ఆమోదం లేదు
దీని అర్థం: ప్రకటనదారుగా మీ గుర్తింపు మీరు ఇచ్చిన డొమైన్‌తో సరిపోలుతుందని మేము ధృవీకరించలేకపోయాము.
తదుపరి చర్య: ప్రకటనదారుగా మీ గుర్తింపు మీరు ఇచ్చిన డొమైన్ సమాచారంతో సరిపోలుతుందో ధృవీకరించండి. తిరస్కరణకు కారణం, తదుపరి చర్యల వివరాలతో మీకు ఇమెయిల్ వచ్చి ఉండాలి. నిర్ణయం తప్పని మీరు భావిస్తే, ఆ ఇమెయిల్‌లోని లింక్‌ను ఉపయోగించి అప్పీల్ చేయండి. పరిష్కారం పొందడానికి అప్పీల్ చేయడం అత్యంత వేగవంతమైన మార్గం. అప్పీల్ చేయడంలో ఏవైనా సమస్యలు ఎదురైనా లేదా అప్పీల్ ఎంపిక కనిపించకపోయినా ప్రకటనల సహాయ బృందాన్ని సంప్రదించండి.
ప్రకటనల సహాయ బృందాన్ని ads-support@openai.com ద్వారా సంప్రదించవచ్చు. సంప్రదించేటప్పుడు మీ ప్రకటన ఖాతా ఐడీని, మీరు ఎదుర్కొంటున్న సమస్య వర్గాన్ని చేర్చండి.
కఠిన నియంత్రణలున్న రంగాలకు ప్రకటనల విధానాల ప్రకారం అర్హత పట్టిక
గమనిక - కొన్ని వర్గాలు అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం. ప్రస్తుతం మేము కొద్దిమంది ప్రకటనదారులతో మాత్రమే పని చేస్తున్నాము. కొన్ని విధాన వర్గాల్లో అనుమతి కోసం దరఖాస్తులను స్వీకరించడం లేదు.
ఆరోగ్యం
| వర్గం | అమెరికా | మిగతా అన్ని దేశాలు |
|---|---|---|
| వైద్యుని చీటీ లేకుండా లభించే మందులు / గర్భ నిర్ధారణ పరీక్షలు | అనుమతి లేదు | అనుమతి లేదు |
| వ్యాధులపై అవగాహన (విధానాలు లేదా వాటికి మద్దతు కూడగట్టే కార్యకలాపాలు మినహా) | అనుమతి ఉంది | అనుమతి లేదు |
| అతి తక్కువ కోతలతో చేసే సౌందర్య చికిత్సలు | అనుమతి ఉంది | అనుమతి లేదు |
| వినియోగదారుల కోసం వైద్య పరికరాలు, ధరించగల పరికరాలు, యాప్‌లు | అనుమతి ఉంది | అనుమతి లేదు |
| దూరవైద్య సేవలు | అనుమతి లేదు | అనుమతి లేదు |
| ఆరోగ్య సేవల సాఫ్ట్వేర్, మౌలిక సదుపాయాలు | అనుమతి ఉంది | అనుమతి ఉంది |
| పోషకాహార అనుబంధాలు | అనుమతి ఉంది | అనుమతి లేదు |
| ఆరోగ్య బీమా | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| వైద్యుని చీటీతో మాత్రమే లభించే మందులు | అనుమతి లేదు | అనుమతి లేదు |
| ఆన్లైన్ మందుల దుకాణాలు | అనుమతి లేదు | అనుమతి లేదు |
| ఆసుపత్రులు, తక్షణ వైద్య సేవలు | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| వైద్య చికిత్సా విధానాలు, ప్రయోగాత్మక చికిత్సలు | అనుమతి లేదు | అనుమతి లేదు |
| లైంగిక ఆరోగ్యం, పెద్దల కోసం ఉద్దేశించిన సేవలు | అనుమతి లేదు | అనుమతి లేదు |
| రుతుస్రావం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులు | అనుమతి ఉంది | అనుమతి లేదు |
| అధిక ప్రమాదం ఉన్న లేదా సురక్షితం కాకపోవచ్చని భావించే ఉత్పత్తులు, సేవలు | అనుమతి లేదు | అనుమతి లేదు |
ఆర్థిక సేవలు
| వర్గం | అమెరికా | మిగతా అన్ని దేశాలు |
|---|---|---|
| డిపాజిట్ ఖాతాలు | అనుమతి ఉంది | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం |
| క్రెడిట్ కార్డులు | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం |
| బీమా (ఆరోగ్య బీమా మినహా) | అనుమతి ఉంది | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం |
| వాహన రుణాలు, లీజులు | అనుమతి ఉంది | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం |
| తనఖా రుణాలు | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం |
| పెట్టుబడులు, మధ్యవర్తిత్వ సేవలు, స్వయంచాలక పెట్టుబడి సలహాదారులు | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం |
| వ్యక్తిగత రుణాలు | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| చెల్లింపులు, నగదు బదిలీలు | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| ఆర్థిక ప్రణాళిక | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| రుణ చరిత్ర పర్యవేక్షణ | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| రుణ చరిత్ర సవరణ | అనుమతి లేదు | అనుమతి లేదు |
| క్రిప్టోకరెన్సీ | అనుమతి పొందిన ఎంపిక చేసిన ప్రకటనదారులకు మాత్రమే పరిమితం | అనుమతి లేదు |
| రుణ భారం నుంచి ఉపశమనం | అనుమతి లేదు | అనుమతి లేదు |
| ప్రైవేట్ విద్యా రుణాల స్థానంలో కొత్త రుణాలు పొందడం | అనుమతి లేదు | అనుమతి లేదు |
| ఆర్జించిన వేతనాన్ని ముందుగానే పొందడం (ఈడబ్ల్యూఏ) | అనుమతి లేదు | అనుమతి లేదు |
| జీతం రోజున తిరిగి చెల్లించే స్వల్పకాలిక రుణాలు | అనుమతి లేదు | అనుమతి లేదు |
| ఆర్థిక సాఫ్ట్వేర్ | అనుమతి ఉంది | అనుమతి ఉంది |
న్యాయ సేవలు
| వర్గం | అమెరికా | మిగతా అన్ని దేశాలు | షరతులు |
|---|---|---|---|
| న్యాయ సేవలు | అనుమతి ఉంది | అనుమతి లేదు | అమెరికాలోని వినియోగదారులకు ప్రకటనలు చూపించాలంటే, అమెరికా ప్రకటనదారులకు అక్కడ న్యాయవాద వృత్తిని నిర్వహించేందుకు లైసెన్స్ ఉండాలి. |
